*_బతుకు బస్టాండ్_*
◆ ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం
◆ 'మెఘా' కబ్జా..?
◆ అభివృద్ధి మాటున ఆస్తుల అమ్మకం
_(ఎస్ ఎంఎం అలీ , 9440335186.)_
*_తెలంగాణ ఆర్టీసీ సమ్మె కొత్త పంథాలోకి వెళుతోంది. సమ్మె చేస్తున్న ఉద్యోగులను డిస్మిస్ చేసి కొత్త ఉద్యోగుల్ని తీసుకుంటున్న ఆర్టీసీ ఇదంతా ఎందుకు చేస్తున్నదో తెలుసా?ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఫేమ్ అనే స్కీమ్ ను ప్రవేశపెట్టింది._*
*'ఫేమ్' అంటూ...:*
ఫేమ్ (ఫాస్టర్ అడాప్క్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రీడ్ అండ్ ఎలక్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా)
స్కీమ్ కింద ఒక్కో ఎలక్ట్రిక్ వెహికిల్ కు దాదాపుగా కోటి రూపాయల వరకూ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. ఈ స్కీమ్ ను ఇప్పటికే చాలా రాష్ట్రాలు వినియోగించుకుంటూ ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వ్యవస్థలో ప్రవేశ పెడుతున్నాయి. ఈ స్కీమ్ ను ఉపయోగించు కోవడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. అభినందనీయం. అందులో ఎలాంటి తప్పు లేదు. రావాలి కూడా.
*ఇక్కడ..అక్కడ.. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ:*
తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన కంపెనీకే ఆ కాంట్రాక్టు ఇప్పించుకున్నది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం.. భవిష్యత్తులో రాద్దాంతం కానుంది. మెగా ఇంజనీరింగ్ కంపెనీ పేరు చెబితే చాలు తెలంగాణ రాష్ట్రంలో ఇంకే కంపెనీ కనీసం టెండర్లు వేయడానికి కూడా ముందుకు రాదు. ఎందుకంటే మరే కంపెనీ టెండర్ వేసినా వారికి రాదు. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో మెగాకే టెండర్లు వచ్చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు తెరాసకు స్నేహ పూర్వక పార్టీ అయిన వైఎస్సార్ సిపీ అధికారంలో ఉన్నందున అక్కడ కూడా 'మెగా' కంపెనీకి ఎదురు లేకుండాపోతోంది. పొకి తెలియని ఓ 'మెగా' కబ్జాకు తెర లేవనుంది. ప్రభుత్వం పట్టు వీడకుంటే సమ్మెలో ఉన్న ఉద్యోగుల పరిస్థితి బతుకు బస్టాండ్ కానున్నదా..? లేక ఉద్యోగ సంఘాలు న్యాయపోరాటం అంటున్నారు.
*రివర్స్ లోనూ.. 'మెగా' మెరుపు:*
ఇటీవల ఏపి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ సిస్టమ్ తీసుకురాగానే అక్కడ 'మెగా' ఒక మెరుపు మెరిసింది. ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ లో రూ. 800 కోట్లు తక్కువకు టెండర్ దాఖలు చేసి మెగా ఇంజినీరింగ్ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి అందరి దృష్టిలో పడ్డారు. తెలంగాణ ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో కూడా ఇప్పుడు ఇదే కంపెనీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ఎందుకు ప్రవేశపెట్టిందో కానీ ఆ అవకాశాన్ని మెగా కంపెనీ మాత్రం చక్కగా వాడేసుకుంటుంది.
*ఇలా వచ్చి...అలా టేకోవర్:*
గోల్డ్ స్టోన్ ఇన్ ఫ్రా కంపెనీ నుంచి ఓలెక్ట్రా కంపెనీని మెగా టేకోవర్ చేసింది. ఈ ఓలెక్ట్రా కంపెనీ తొలి విడతగా 40 ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేసి రోడ్లపై తిప్పేందుకు కాంట్రాక్టు పొందింది. ముందే చెప్పినట్లు మిషన్ భగీరధ టెండర్లు అయినా కాళేశ్వరం అయినా మెగా కంపెనీకి రావాల్సిందే కదా అదే కోవలో ఎలక్ట్రిక్ బస్సుల టెండర్ కూడా అదే కంపెనీకి వచ్చేసింది. నిన్న ఆర్టీసీ సమ్మె పరిస్థితిపై సమీక్ష జరిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 'ఆర్టీసీలో సగం బస్సులు సంస్థవి, మరో సగం ప్రయివేటు వారికి ఇచ్చేద్దాం' అని ప్రతిపాదించారు. దాంతో ఒక్క సారిగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ నుంచి 40 ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టు పొందిన 'ఓలెక్ట్రా'కు అంటే 'మెగా' కృష్ణారెడ్డికి ఆర్టీసీని ధారాదత్తం చేయడానికే కేసీఆర్ ఈ విధమైన ప్రకటన చేశారని అందరూ భావిస్తున్నారు. ఏపీలోనూ ఆ కాంట్రాక్ట్ కోసం మెగా ప్రయత్నాలు చేస్తూండటంతో ఇక తెలంగాణలో సగం అద్దె బస్సులు మేగా కృష్ణారెడ్డికేనా అన్న చర్చ ప్రారంభమైంది. కన్స్ట్రక్షన్ కార్యకలాపాల్లో చురుకుగా ఉండే 'మెగా' కొన్నాళ్ల కిందట ఎలక్ట్రిక్ బస్సుల వ్యాపారంలోకి వచ్చారు. బస్సుల ఉత్పత్తి ప్రారంభించారు.
*'బుల్లి' కంపెనీ... 'మెగా' పని:*
దేశంలో టాటా, అశోక్ లేలాండ్, ఐషర్ లాంటి కంపెనీలతో పోల్చితే ఈ ఒలెక్ట్రా కంపెనీ చాలా చిన్నదే. కానీ తెలంగాణలో బస్సులు నడిపే కాంట్రాక్ట్ దక్కించుకుంది. అసలు విషయం చెప్పటానికి మొహమాటం ఎందుకు..? దీనికి ప్రభుత్వ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యమే కారణం. ఇప్పుడు తెలంగాణ కార్మిక వర్గాల్లో ప్రధానంగా జరుగుతున్న చర్చ ఈ మేగా బస్సులపైనే. ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా కేసీఆర్ వెళ్తున్నారని ఇందులో ప్రధానంగా మేగా కంపెనీకే అవకాశాలు దక్కేలా చేయబోతున్నారని ఆరోపిస్తున్నారు.
*ప్రభుత్వ వివరణ:*
అద్దె బస్సులతో ఇప్పటికే సంస్థను పాక్షికంగా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేశారని దానిని అడ్డుకునేందుకు సమ్మె చేస్తూంటే మొత్తానికే ప్రైవేటీకరణ చేస్తున్నారని కార్మికులు అంటున్నారు. అయితే ప్రభుత్వ వివరణ మరొక విధంగా ఉంది. తెలంగాణ ఆర్టీసీ దగ్గర మొత్తం 10,460 బస్సు లు వున్నాయి. అందులో 8,320 మాత్రమే ఆర్టీసీ సొంత బస్సులు. మిగతా 2140 బస్సులు అద్దెవే. ఇందులో 40 ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే మేగా పెట్టుబడులు ఉన్న ఓలెక్ట్రా సంస్థ నడుపుతోంది అనేది ప్రభుత్వ వివరణ.
*ఇది సాధ్యమేనా..?:*
మొత్తం ఆర్టీసీ బస్సుల్లో ఓలెక్ట్రా బస్సులు 0.38 శాతం మాత్రమే. ఈ బస్సులతోనే ఓలెక్ట్రా కోట్లు ఆర్జిచేసేస్తోందా? అందులోను నడపటం మొదలు పెట్టి 7 నెలలు కూడా కాలేదు. ఏళ్లతరబడి ప్రతి ఏటా వందల కోట్ల నష్టాలూ వేలకోట్ల రూపాయల అప్పుల భారంలో కూరుకుపోయిన ఆర్టీసీకి 'మార్చి నుంచి 40 బస్సులు అద్దె ప్రాతిపదికన నడుపుతున్న ఓలెక్ట్రా కారణమంటే నమ్మశక్యమేనా?' అంటూ ప్రభుత్వ వర్గాలు సన్నాయి నొక్కులు నొక్కేస్తోంది.
*ప్రభుత్వ వాదన:*
ఇంచుమించు మూడు దశాబ్దాలుగా ఆర్టీసీ అద్దె బస్సులు తీసుకుని నడుపుతోంది. సంవత్సరానికి రూ.1200 కోట్లు నష్టం చూస్తోంది తెలంగాణ ఆర్టీసీ. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న డీజిల్ ధరలు. ఇంధన ధరల్లో సబ్సిడీ లేకపోవటం, రూ. 5 వేల కోట్ల రుణభారం వెరసి ఆర్టీసీని నష్ఠాల బాట పట్టిస్తోందనేది ప్రభుత్వ వాదన.
*ఇలాగే కొనసాగితే..:*
తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనే లేదు. కేవలం అద్దె ప్రాతిపదికనే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుని తిప్పుతోంది. ఈ నలభై బస్సులకు కేంద్రం ఇచ్చేది కేవలం 20 కోట్లు మాత్రమే. అదీ బస్సుకు కేవలం 50 లక్షలు. మిగతా డబ్బు పెట్టె సామర్ధ్యం లేక కేవలం అద్దెకు తీసుకుని నడపడానికె ఆర్టీసీ నిర్ణయించుకుంది. మరి దీనికే కోట్లు తినేస్తున్నారని ప్రచారం చేస్తే ఎలా అని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వ వాదన ఎలా ఉన్నా కార్మిక సంఘాలు చెబుతున్న ఈ విషయాలను అధిక శాతం ప్రజలు నమ్మితే మాత్రం ఆర్టీసీ సమ్మె వేరే మార్గంలోకి వెళ్లడం ఖాయం.
*ఆర్టీసీ ఆస్తులు అమ్మనున్నారా..?:*
ఆర్టీసీని మరో కోణంలోకి మారిస్తే... నష్ట నివారణ చర్యల పేరుతో, అభివృద్ధి మాటున ఆర్టీసీ ఆస్తులను ప్రభుత్వం లీజుకు ఇవ్వటమో... లేక తెగనమ్మటం చేస్తే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుందో ...? కాలం సమాధానం చెపుతోంది. ఏది ఏమైనా బతుకు బస్డాండే...
*_కేసీఆర్ అహంకారానికి నిదర్శనం -అశ్వత్థామరెడ్డి_*
ఆర్టీసీలో కొత్త నియామకాలు చేపడతామంటూ స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించడం ఆయన అహంకారానికి నిదర్శనమని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతమంది ఉద్యోగులను ఒకేసారి తొలగిస్తామనడం అప్రజాస్వామికమని చెప్పారు. నిన్నటి వరకు ఆర్టీసీని కాపాడుకోవడం కోసం ఆందోళన చేశామని.. ఇక నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు పోరాడాల్సిన అవసరముందని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌కు ఉద్యమ ఫోబియా పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాలని.. కార్మికులకు రావాల్సిన బకాయిలను సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే యోచనలో ప్రభుత్వం ఉందని.. దీన్ని కార్మికులు, ప్రజలంతా అడ్డుకుంటారన్నారు. 48వేల కార్మికులను తీసేశామని అంటున్నారు. ఆ ఉత్తర్వులు ఎప్పుడు పంపిస్తారో చెప్పండి. వాటిని తీసుకోవడానికి కార్మికవర్గం మొత్తం సిద్ధంగా ఉన్నాం. మేం కూడా న్యాయనిపుణులతో మాట్లాడాం. దీనిపై కోర్టులోనే తేల్చుకుంటాం'' అని అశ్వత్థామరెడ్డి హెచ్చరించారు.