నల్గొండ : ప్రతి సోమవారం ప్రజల నుండి వస్తున్న అర్జీలు, ఫిర్యాదుల పరిష్కారం సమర్ధవంతంగా చేయడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో త్వరితంగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ అన్నారు.
సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులు, ఆర్జీలు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును ఇప్పటికే కంప్యూటర్లలలో పొందుపరుస్తున్నామని ఇకపై ప్రతి నెల ఎన్ని పిర్యాదులు వచ్చాయి, ఎన్ని పరిష్కారం అయ్యాయో సమీక్షించడం జరుగుతుందని, అదే సమయంలో పెండింగ్ ఫిర్యాదులు ఎందుకు పరిష్కారం కాకుండా ఉన్నాయో తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు. పెండింగ్ ఫిర్యాదులను సైతం వెంట వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక సమయం కేటాయించి ప్రజలకు పోలీస్ శాఖ పట్ల మరింత గౌరవం పెరిగే విధంగా సేవలందిస్తామని ఎస్పీ తెలిపారు. గ్రీవెన్స్ డేలో భూ సమస్యలపై అత్యధికంగా ఫిర్యాదులు అందుతున్న క్రమంలో వాటి పై ప్రత్యేక దృష్టి సారించి వాటన్నింటిని పరిష్కరించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బాధితుల సమస్యలను జాగ్రత్తగా విని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ ద్వారా బాధితుల సమస్యలపై స్పందించి వారికి న్యాయం అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్ లో భూ సమస్యలు అధికంగా వస్తున్నాయని ఈ సమస్యలు శాంతి భద్రతల సమస్యలుగా మారకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రీవెన్స్ డే లో స్వీకరిస్తున్న పిర్యాదులన్నింటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. గతంలో కన్నా ఫిర్యాదులు, దరఖాస్తుల సంఖ్య పెరిగిందని అయినప్పటికీ ప్రతి ఒక్కరికి సమయం కేటాయిస్తూ పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగేలా కృషి చేస్తున్నామని తెలిపారు. పోలీసుల పని విధానంలో మరింత మార్పు తీసుకువస్తూ ప్రజలకు సమర్ధవంతమైన సేవలందించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎస్పీ వివరించారు. రానున్న రోజులలో ప్రజలంతా ఎలాంటి భయం లేకుండా తమ సమస్యల్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చే విధంగా బాధితులకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. గ్రీవెన్స్ డే లో దరఖాస్తులు అత్యధికంగా వస్తున్న క్రమంలో సోమవారం రోజే కాకుండా సాధారణ రోజులలోనూ సమయం కేటాయించడం ద్వారా అర్జీదారులందరి సమస్యలు తెలుసుకుంటూ జిల్లాలో ఎలాంటి భూ తగాదాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పటిష్ఠంగా వ్యవహరిస్తున్నామని ఎస్పీ రంగనాధ్ తెలిపారు. పెండింగులో ఉన్న మిగిలిన పిర్యాదుదారులు ఎస్పీని కలుసుకునేందుకు తేదీ, సమయం కేటాయించారు.